1 దినవృత్తాంతములు 13

1దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు. 2పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి. 3ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.” 4దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు. 5కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబో హమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయు లందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు. 6దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది. 7ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు. 8దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు. 9వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు. 10ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు. 11ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా” అని పిలవబడుతూ వుంది. 12ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు. 13కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు. 14మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.


Copyrighted Material
Learn More

will be added

X\