1 దినవృత్తాంతములు 16

1దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. 2దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు. 3అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు. 4ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. 5వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు. 6యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. 7అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు. 8యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి. యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి. 9యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి. యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి! 10యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి; యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖ సంతోషాలు పొందెదరు గాక! 11యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. 12యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి. 13యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా, యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు. 14యెహోవాయే మన దేవుడు ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది! 15తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు. ఆయన మాట వేయితరాల పంట! 16అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం 17యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు. అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక. 18“కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు. 19దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే. వారు ఆ రాజ్యంలో పరాయి వారు. 20వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు. వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు. 21కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు. 22“నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు; నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!” అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు. 23భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి! యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి! 24యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి! 25యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి. 26ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే! కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు. 27యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు. యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు! 28పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి! 29యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి! మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి! 30భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి. కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు. 31భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక! 32సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబచ్చుగాక! 33అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి! ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు. 34ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు! యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది. 35“మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి. 36ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక! అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు! 37పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు. 38ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను. 39యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు. 40దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 41హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక. 42హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు. 43పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.


Copyrighted Material
Learn More

will be added

X\