1 సమూయేలు 31

1ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు. 2ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. 3సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరంతూట్లు పడిపోయింది. 4సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు. 5అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు. 6కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిరపోయారు. 7లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు. 8ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు. 9ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు. 10వారు సౌలు కవచాన్ని అష్ఠారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు. 11ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చీ యాబేష్గిలాదు నివాసులు విన్నారు. 12కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు. 13తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.


Copyrighted Material
Learn More

will be added

X\