1 సమూయేలు 7

1కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర పెట్టెను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టెను తీసుకొని వెళ్లారు. పెట్టె విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు. 2కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను. ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు. 3ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.” 4అది విన్న ఇశ్రాయేలీయులు బయలు అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు. 5“ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు. 6ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక నయాయమూర్తిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు. 7ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. 8వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు. 9అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు. 10సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. 11ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు. 12ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల” అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు అని చెప్పాడు.” 13ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు. 14ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు పక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది. 15సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయమూర్తిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. 16ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబతూ, వారిని పాలించాడు. 17కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.


Copyrighted Material
Learn More

will be added

X\