2 సమూయేలు 22

1యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు: 2యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు! 3సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు! 4యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును! 5మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి! 6సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను! 7నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది. 8భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన! 9ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి. 10ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు! 11యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు! 12యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు. 13ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది! 14యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు! 15యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు. 16అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి! 17యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు; 18నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు! 19నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు! 20నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు; 21యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి! 22అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను! 23యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను. 24దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను! 25అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను. 26నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు! 27ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు! 28ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు! 29యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు. 30మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను! 31దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు. 32యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. 33దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు! 34జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు. 35దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు. 36డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది! 37నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. 38నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను; 39నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను! 40ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించినావు. 41నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను! 42నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి! 43నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను. 44నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు! 45ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు. 46అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు! 47యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ; 48నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన; 49నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు. 50యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను! 51ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు!


Copyrighted Material
Learn More

will be added

X\