ఆమోసు 7

1యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది. 2మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!” 3అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు. 4నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్పఅగాధ జలాన్ని నశింపజేసింది. ఆ ఆగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది. 5కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయుము. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!” 6పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు! 7యోహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపు గుండు (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు. 8“ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు. “ఒక మట్టపు గుండు” ను అని నేనన్నాను. అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తోలగిస్తాను). 9ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశం మీద పడి వారిని కత్తులతో చంపుతాను.” 10బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశంలో అతని మాటలు పట్టవు. 11యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశం నుండి బందీలుగా కొనిపోబడతారనీ అమోసు ప్రచారం చేస్తున్నాడు.” 12అమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్గదర్శీ (ప్రవక్త), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. 13అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!” 14అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశం నుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను పరిక్షిస్తూ వుంటాను. 15నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు. 16కావున యెహోవా వర్త మానాన్ని విను. నీవు, ‘ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు’ అని నాకు చెపుతున్నావు. 17కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ శపర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”


Copyrighted Material
Learn More

will be added

X\