ద్వితీయోపదేశకాండము 14

1“మీరు మీ దేవుడైన యెహోవా పిల్లలు. ఎవరైనా చనిపోయినప్పుడు మీ విచారం వ్యక్తం చేయటానికి మిమ్మల్ని మీరు కోనుకోకూడదు. మీ తలలు గుండు గీసుకోకూడదు. 2ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా ఉన్నారు. మీరు యెహోవాకు ప్రత్యేకమైన ప్రజలు. ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొన్నాడు. 3“తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు. 4మీరు ఈ జంతువులను తినవచ్చును: ఆవులు, గొర్రెలు, మేకలు, 5జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి గొర్రెలు, అడవి మేకలు, లేడి. కొండ గొర్రెలు. 6గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనామీరు తినచ్చును. 7కానీ ఒంటెలను, కుందేళ్లను, పాట్టి కుందేళ్లను తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. కనుక ఈ జంతువులు మీకు పవిత్ర ఆహారం కాదు. 8మరియు మీరు పందుల్ని తినకూడదు. వాటి గిట్టలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అందుచేత పందులు మీకు పవిత్ర ఆహారం కాదు. పందిమాంసం ఏమీ తినవద్దు, చచ్చిన పందిని ముట్టుకోవద్దు. 9“రెక్కలు, పొలుసు ఉన్న ఎలాంటి చేపనైనా తినవచ్చు. 10కానీ రెక్కలు పొలుసు లేకుండా నీళ్లలో జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర ఆహారం కాదు. 11“పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును. 12ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రక్తమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ పైడికంటె ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతులు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి సంకుబుడి కొంగలు, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. 19“రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు. 20అయితే పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును. 21“దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తినవద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి మీరు ఇవ్వవచ్చు, ఆతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు. “గొర్రెపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు. 22“ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి. 23తర్వాత యెహోవా తనకు ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో పదోవంతు, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, గొర్రెల మందలో, మొట్టమొదట పుట్టిన వాటిని మీ దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌరవించటం జ్ఞాపకం ఉంచుకొంటారు. 24ఆయితే మీరు ప్రయాణం చేయటానికి ఆ స్థలం మీకు చాలా దూరం కావచ్చును. ఒకవేళ మీకు యెహోవా అనుగ్రహించిన పంటలన్నింటిలోని దశమ భాగాలు మీరు మోసుకొని పోలేకపోవచ్చును. ఆలాగనుక జరిగితే యిలా చేయండి: 25మీ పంటలోని ఆ భాగం అమ్మివేయండి. ఆ ధనం మీతోకూడ తీసుకొని, యెహోవా నిర్ణయించిన ఆ ప్రత్యేక స్థలానికి వెళ్లండి. 26మీకు యిష్టం వచ్చింది ఏదైనా- ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి. 27అయితే మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే మీవలే వారికి భూమిలో భాగం లేదు. 28“ప్రతి మూడేళ్ల చివరలో, మీ దశమ భాగాలన్నీ ఆ సంవత్సరానికి మీరు తీసుకొని రావాలి. మీ పట్టణంలో ఇతరులు దీనిని వినియోగించుకోగలిగిన ఒక స్థలంలో ఈ ఆహారాన్ని ఉంచాలి. 29లేవీయులకు వారి స్వంత భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.


Copyrighted Material
Learn More

will be added

X\