ద్వితీయోపదేశకాండము 30

1“నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు. 2ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు. 3అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు. 4ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు. 5యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది. 6మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు. 7“మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. 8మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు. 9మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతీదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. 10అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ k ధర్మశాస్త్రపు గ్రంథంలోk వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి. 11“ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 12మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’ 13మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’ 14లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది. 15“జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. 16మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 17అయితే మీరు యోహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే 18మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయోర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు. 19“ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెందు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుత్తున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపంతెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. 20మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందు చేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్టు ఇస్తాడు.”


Copyrighted Material
Learn More

will be added

X\