ద్వితీయోపదేశకాండము 9

1“ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు యోర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి. 2అక్కడి ప్రజలు ఎత్తయిన వాళ్లు, బలం ఉన్నవాళ్లు. వారు అనాకీయ ప్రజలు. ఆ ప్రజలను గూర్చి మీకు తెలుసు. ‘అనాకీయ ప్రజల మీద ఎవడూ గెలవలేడు’ అని మన గూఢచారులు చెప్పటం మీరు విన్నారు. 3అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు. 4“ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే. 5మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు. 6మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు. 7“అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశంనుండి బయటకు వెళ్లిన రోజునుండి ఈ చోటికి వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడుటకు నిరాకరించారు. 8ఇంకా హొరేబు కొండ దగ్గర కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది యెహోవకు. 9రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనంచేయలేదు, నిళ్లు త్రాగలేదు. 10అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వ్రేలితో రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్ని ఆయన రాసాడు. 11“కనుక 40 పగళ్లు 40 రాత్రుళ్లు ఆయిపోగానే, ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు ఇచ్చాడు. 12అప్పుడు ‘లేచి త్వరగా ఇక్కడనుండి క్రిందికి వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకొన్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం ఒక విగ్రహం చేసుకొన్నారు’ అని యెహోవా నాతో ఇలా చెప్పాడు. 13“ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు. 14వారి పేర్లనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలుకంటె ఎక్కువ బలం గల యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ జేస్తాను.’ 15“అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి క్రిందికి వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి. 16నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు. 17అందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరుగగొట్టేసాను. 18అప్పుడు నేను మొదటి సారిలాగ 40 పగళ్లు 40 రాత్రుళ్లు యెహోవా యెదుటు నేలమీద సాష్టాంగ పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను యిలా చేసాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయన కోపం పుట్టించారు. 19యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు. 20అహరోనును నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను. 21మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను. 22“మరియు మీరు తబేరావద్ద, మస్సావద్ద, కిబ్రోత్ హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. 23మీరు కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా చేప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. ‘మీరు వేళ్లి నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి’ అని ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. మీరు ఆయన ఆజ్ఞను వినలేదు. 24నేను మిమ్మల్ని ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయలయ్యేందుకు నిరాకరిస్తున్నారు. 25“కనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 రాత్రుళ్లు సాష్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేస్తానని యెహోవా చేప్పాడు గనుక. 26నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు. 27నీ సేవకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు. 28నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో. 29ఆయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు చేందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.’


Copyrighted Material
Learn More

will be added

X\