నిర్గమకాండము 2

1లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు. 2ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడ్నెల్లపాటు ఆ శిశువును దాచి ఉంచింది. 3అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది. 4ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది. 5సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది. 6రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది. 7ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది. 8“సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది. 9“ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీతన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది. 10ఆ పసివాడు పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజకుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్లవాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ పిల్లవాడ్ని నీళ్లలోంచి బయటికి తీసింది కనుక ఆమె వానికి మోషే అని పేరు పెట్టింది. 11మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు. 12ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. 13మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు. 14దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు. “అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు. 15మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు. మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. 16మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు. 18తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు. 19“గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు. 20అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో. 21అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు. 22సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు. 23చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. 24దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు. 25ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.


Copyrighted Material
Learn More

will be added

X\