యెహెజ్కేలు 23

1యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2“నరపుత్రుడా, సమరయ, యెరూషలేములను గురించిన ఈ కథ ఆలకించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఒక్క తల్లి కడుపునే పుట్టారు. 3చిన్న వయస్తులో ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యులను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు చన్నులను పట్టుకోనిచ్చారు. 4పెద్ద కుమారై పేరు ఒహొలా. ఆమె చెల్లిలి పేరు ఒహొలీబా. ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు కలిగారు. (నిజానికి ఒహొలాయే సమరయ. ఒహొలీబాయే యెరూషలేము.) 5“అప్పుడు ఒహొలా నా పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించింది. ఆమె ఒక వేశ్యలా జీవించసాగింది. తన విటులను కోరుకోనారంభించింది. ఊదారంగు బట్టలు వేసుకున్న అష్షూరు సైనికులను ఆమె చూసింది. 6గుర్రాలపై వెళ్లే ఆ సైనికులంతా కోరుకో తగ్గ యువకులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు. 7ఆ మనుష్యులందరికి ఒహొలా తనను తాను సమర్పించుకుంది. అష్టూరు సైన్యంలో వారంతా ప్రత్యేకంగా ఎంపిక చేయబడినవారు. వాళ్లందరినీ ఆమె కోరుకొంది! వారి రోత విగ్రహాలతో ఆమె కూడ మలినపర్చబడింది. 8దానికి తోడు, ఈజిప్టుతో తన ప్రేమ కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈజిప్టు ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వనపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిప్టు. ఈజిప్టు తన దొంగ ప్రేమనంతా ఆమెపై ఒలకపోశాడు. 9అందువల్ల ఆమె విటులను ఆమెను పొందడానికి రానిచ్చాను. ఆమె అష్టూరును కోరుకుంది. ఆందుచే నేనామెను వారికిచ్చాను! 10వారామెకు మానభంగం కావించారు. వారు ఆమె పిల్లలను ఎత్తుకుపోయారు. తరువాత వారు కత్తితో ఆమెను చంపివేశారు. వారామెను అలా శిక్షించారు. స్త్రీలు ఆమెను గురించి ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు. 11“తన చిన్న సోదరి ఒహొలీబా ఇవన్నీ జరగటం చూసింది. అయినా తన అక్కకంటె ఒహొలీబా ఎక్కువ పాపాలు చేసింది! ఒహొలాకంటె ఈమె మరీ విశ్వాసంలేని స్త్రీ అయింది. 12ఈమె అష్షూరు నాయకులను, అధికారులను కోరుకొంది. ఊదా బట్టల్లో గుర్రాలమీద స్వారీచేసే ఆ సైనికులను ఆమె కోరుకొంది. వారంతా ఆశించదగ్గ యువకులు. 13ఒకే రకమైన తప్పులతో ఆ ఇద్దరు స్త్రీలు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నట్ల నేను చూశాను. 14“ఒహొలీబా నాపట్ల విశ్వాసం లేకుండ కొన సాగింది. బబులోను (బాబిలోనియా)లో గోడలమీద చెక్కిన మనుష్యుల బొమ్మలను చూసింది. ఇవి ఎర్రని బట్టలు ధరించిన కల్దీయ మనుష్యుల బొమ్మలు. 15వారి నడుమున చూట్టు పటకాలు, తలలపైన పొడుగాటి తలపాగాలు ధరించి వున్నారు. ఆ మనుష్యులందరు రథాధిపతుల వలె వున్నారు. వారంతా బబులోనులో జన్మించిన వారుగనే కన్పించారు. 16మరి ఒహొలీబా వారందరినీ కావాలనుకొంది. 17కావున ఆ బబులోను మనుష్యులందరూ ఆమెతో సంభోగించటానికి ఆమె ప్రేమ పాన్పు మీదికి వచ్చారు. ఆమెను విచ్చల విడిగావాడుకొని, చివరకు ఆమె వారిని చీదరించుకునేలా ఆమెను అపవిత్రపరచారు. 18“ఒహొలీబా తన అవిశ్వాసాన్ని అందరూ గమనించేలా ప్రవర్తించింది. ఆమె తన నగ్నత్వాన్ని అనేక మంది అనుభవించనిచ్చింది. దానితో నాకు ఆమెపట్ల విసుగు పుట్టి, నేనామె అక్కను చీదరించుకున్నట్లు ఈమెను కూడ అసహ్యించుకున్నాను. 19పదే పదే ఒహొలీబా నాపట్ల అవిశ్వాసంతో ప్రవర్తించింది. పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన ప్రేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది. 20గాడిద మేఢ్రంవంటి శిశ్నముతో గుర్రంవలె వరదలా రేతస్సును కార్చే తన విటుని ఆమె జ్ఞాపకం చేసుకున్నది. 21“ఒహొలీబా, నీ ప్రేమికుడు నీ చనుమొనలు ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు. 22కావున బహోలీచా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు. 23వారందరినీ నేను బబులోను (బాబిలోనియా)నుండి రప్పిస్తాను. ముఖ్యంగా కల్దీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు. 24ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గుర్రాలమీద, రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. వారు తమ ఈటెలను, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వస్తారు. వారంతా నీ చూట్టూ గుమిగూడతారు. నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు. 25నేనెంత రోషంగా వున్నానో నీకు చూపిస్తాను. వారు చాలా కోపగించి నిన్ను బాధిస్తారు. వారు నీ ముక్కూ చెవులు కోసివేస్తారు. వారు కత్తితో నిన్ను చంపుతారు. పిమ్మట వారు నీ పిల్లలను తీసుకుపోతారు. నీవద్ద మిగిలిన ప్రతి దానిని వారు తగులబెడతారు. 26నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు. 27ఈజిప్టులో నీ ప్రేమ కలాపాలను గురించిన నీ కలలను నిలిపివేస్తాను. మళ్లీ నీవెన్నడు వారికొరకు ఎదురు చూడవు. నీవు ఇకముందెన్నడు ఈజిప్టును జ్ఞాపకం చేసుకొనవు!’” 28నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “నీవు అసహ్యించుకునే మనుష్యులకు నిన్ను అప్పజెప్పుచున్నాను. నీవు విసుగుచెందిన మనుష్యులకే నిన్ను అప్పజెప్పుచున్నాను. 29వారు నిన్నెంత అసహ్యించుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన కలలుగన్నావని వారు తలుసుకుంటారు. 30అన్యదేశీయులను వెంబడించి పోవటానికి నన్ను వదిలిపెట్టినప్పటి నుండి నీవీ పాపకార్యాలకు ఒడిగట్టావు. వారి రోత విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టినప్పటి నుండి నీవీ చెడ్డ కార్యాలకు తలపడ్డావు. 31నీవు నీ అక్కను అనుసరించి, ఆమె గడిపిన జీవితాన్నే నీవూ గడిపావు. నీకు నీవే విషపు పాత్రను అందుకుని, నీ చేతిలో పట్టుకున్నావు. నీకు శిక్ష నీవే విధించుకున్నావు.” 32ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగుతావు. అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె. ఆ గిన్నెలో విషం (శిక్ష) చాలా పడుతుంది. ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు. 33తాగినవానిలా నీవు తూలిపోతావు. నీవు గొప్ప దుఃఖముతో నింపబడతావు. షోమ్రోను పాత్ర వినాశ ఉపద్రవములతో నిండియున్నది. అది నీ అక్క తాగిన విషవు (శిక్ష) పాత్ర లాంటిదే. 34ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు. దానిని నీవు పూర్తిగా తాగుతావు. పిమ్మట పాత్ర క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు. బాధతో నీ రొమ్ములు చీరుకుంటావు. నేను ప్రభువైన యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది. ఈ విషయాలు నేనే చెప్పాను. 35“కావున నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘యెరూషలేమా నీవు నన్ను మర్చి పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన కలలకూ నీ వ్యభీచారానికి నీవు శ్రమననుభవించాలి.’” 36నా ప్రభవైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరుడా, నీవు ఒహొలా, ఒహొలీబాలకు తీర్పు ఇస్తావా? అయితే వారు చేసిన భయంకర నేరాలను వారికి చెప్పు. 37వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. వారిపై హత్యానేరం ఉంది. వారు వేశ్యల్లా ప్రవర్తించారు. వారి అపవిత్ర విగ్రహాలతో వుండటానికి వారు నన్ను వదిలివేశారు. నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు. 38నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను, నా పవిత్ర స్థలాన్ని వారు సామాన్యమైనవిగా పరిగణించారు. 39వారి విగ్రహాల కొరకు వారు తమ పిల్లల్ని బలిపెట్టారు. తరువాత వారు నా పవిత్ర స్థలంలోకీ వెళ్లి దానిని కూడ అపవిత్ర పర్చారు! ఇది వారు నా ఆలయం లోపలే చేశారు! 40“దూర ప్రాంతాల మనుష్యుల కొరకు వారు కబురు పంపారు. ఆ మనుష్యుల కొరకు నీవు (ఒహొలీబా) దూతను పంపావు. వారు నిన్ను చూడటానికి వచ్చారు. వారికొరకు నీవు స్నానం చేసి, కండ్లు అలంకరించు కొని, ఆభరణాలు ధరించావు. 41ఒక అందమైన పాన్పు మీద నీవు కూర్చుని, దాని ముందు ఒక బల్లవేశావు. ఆ బల్ల మీద నా సుగంధ ధూప ద్రవ్యాన్ని, నూనెను ఉంచావు. 42“యెరూషలేములో వినబడే శబ్దం విందులో ప్రజలు చేసే రణగొణ ధ్వనిలా ఉంది. విందుకు అనేక మంది వచ్చారు. ఎడారినుండి వచ్చిన వారు కావటంతో వారు తాగుతూ ఉన్నారు. వారు స్త్రీలకు కడాయాలు, అందమైన కిరీటాలు యిచ్చారు. 43కామ క్రీడలతో నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్లాడినాను. వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం చేస్తారా? అని అన్నాను. 44కాని వారంతా ఒక వేశ్యవద్దకు ఆమెవద్ద వెళ్ళుచున్నట్లుగనే ఆమె వద్దకు వెళ్ళుతున్నారు. కామంతో పాపకార్యం చేసే ఒహొలా, ఒహొలీబాల వద్దకు వారు మళ్లీ, మళ్లీ వెళ్లారు. 45“కాని మంచి మనుష్యులు వారిని నేరస్థులుగా తీర్పు ఇస్తారు. వారా స్త్రీలను వ్యభిచార, హత్యానేరాల కింద దోషులుగా నిర్ణయిస్తారు. ఒహొలా మరియు ఒహొలీబాలు వ్యభచార పాపం చేసినందుకు, వారు చంపిన ప్రజల రక్తం ఇంకా వారి చేతులపై వున్నందున ఇది ఇలా జరుగుతుంది!” 46నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ ప్రజలందరు ఒహొలా, ఒహొలీబాలను శిక్షింపనీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీలను శిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు. 47తరువాత ఈ గుంపు వారిద్దరిపై రాళ్ళు విసరి చంపివేస్తారు. వారా ఇద్దరినీ తమ కత్తులతో నరికి ముక్కలు చేస్తారు. వారు ఈ స్త్రీల పిల్లలను చంపి, వారి ఇండ్లను తగలబెడతారు. 48ఈ రకంగా ఈ దేశాన్నుండి అవమానాన్ని తొలగిస్తాను. మిగిలిన స్త్రీలంతా మీరు చేసినటుంటి సిగ్గు మాలిన పనులు చేయకుండ వుండేలా హెచ్చరింపబడతారు. 49మీరు చేసిన చెడు కార్యాలకు వారు మిమ్మల్ని శిక్షిస్తారు. హేయమైన మీ విగ్రహాలను ఆరాధించిన నేరానికి మీరు శిక్షింపబడతారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొంటారు.”


Copyrighted Material
Learn More

will be added

X\