యెహెజ్కేలు 25

1యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2“నరపుత్రుడా, నీవు అమ్మెనీయులనుద్ధేశించి వారికి వ్యతిరేకంగా నా తరపున మాట్లాడు. 3అమ్మెను ప్రజలకు ఇలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా మాటను ఆలకించండి! నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెపుతున్నాడు, నా పవిత్ర స్థలం నాశనం చేయబడినప్పుడు మీరు సంతోషించారు. ఇశ్రాయేలు కాలుష్యం చెందినప్పుడు మీరు దానికి వ్యతిరేకులయ్యారు. యూదా ప్రజలు బందీలుగా పట్టుకు పోబడినప్పుడు మీరు యూదా వంశానికి వ్యతిరేకులయ్యారు. 4కావున తూర్పు నుండి వచ్చే ప్రజలకు మిమ్మల్ని అప్పగిస్తాను. వారు మీ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. మీ దేశంలో వారి సైన్యాలు స్థావరాలు ఏర్పాటు చేస్తాయి. వారు మీ మధ్య నివసిస్తారు. వారు మీ పంటను తింటూ, మీ పాలు తాగుతారు. 5“‘రబ్బా నగరాన్ని ఒంటెలు మేసే పచ్చిక బయలుగా చేస్తాను. అమ్మెను దేశాన్ని గొర్రెల దొడ్డిగా జేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 6యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు. 7కావున నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైనికులు యుద్ధంలో తీసుకొనే విలువైన వస్తువుల్లా మీరు ఉంటారు. ఇతర దేశాలతో మీరు వేరుగా అయిపోతారు. దూర దేశాల్లో మీరు చనిపోతారు. నేను మీ దేశాన్ని నాశనం చేస్తాను! అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’” 8నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము) ప్రజలు, ‘యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే ఉంది’ అని అంటారు. 9నేను మోయాబు భుజంలోకి నరుకుతాను. సరిహద్దుల్లో వున్న దాని నగరాన్నిటినీ, ఆ భూమి గొప్పదనాన్ని తీసుకుంటాను. రాజ్యానికి తలమానికమైన బేత్యేషీమోతు, బయల్మెయోను, కిర్య తాయిములను తీసుకుంటాను. 10తరువాత ఈ నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. వారు నీ రాజ్యాన్ని చేజిక్కించు కుంటారు. తూర్పు రాజ్యాల ప్రజలు అమ్మెను ప్రజలను నాశనం చేయనిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు. 11అలాగే మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను యెహోవానని తెలుసు కుంటారు.” 12నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఎదోము ప్రజలు యూదా వంశంపై తిరుగుబాటు చేసి, చివరికి దానిని చేజిక్కించుకోవాలని కూడ ప్రయత్నించారు. ఎదోము ప్రజలు నేరస్థులు.” 13కావున నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమనగా, “నేనే ఎదోమును శిక్షిస్తాను. ఎదోములో వున్న ప్రజలను, జంతువులను నాశనం చేస్తాను. తేమాను నుండి దదాను వరకు గల మొత్తం ఎదోము, దేశాన్ని నేను నాశనం చేస్తాను. ఎదోమీయులు యుద్ధంలో చనిపోతారు. 14నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వినియోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎదోముపై నాకు గలకోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారిని శిక్షించినట్లు ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఫిలిష్తీయులున ప్రయత్నించారు పగతీర్చుకొనుచున్నారు. వారు అతిక్రూరులు. తమ కోపం తమలోనే ఎక్కువ కాలం వుంచుకొని తమని తాము దహింపజేసుకొన్నారు!” 16కావున నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “నేను ఫిలిష్తీయులను శిక్షిస్తాను. కెరేతీయులను నేను నాశనం చేస్తాను. సముద్ర తీరాన నివసిస్తున్న ప్రజలను నేను సర్వనాశనం చేస్తాను. 17నేనా ప్రజలను శిక్షిస్తాను. వారిపై పగ సాధిస్తాను. నా కోపంతో వారికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!”


Copyrighted Material
Learn More

will be added

X\