యెహెజ్కేలు 33

1యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2“నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు. 3ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. 4ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. 5అతడు బాకా విన్నాడు. ఆయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్య పెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడు కొనగలిగేవాడు. 6“‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’ 7“నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి. 8‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. 9ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పి నావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. 10“కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు. 11“నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’ 12“నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’ 13“ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు. 14“లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు. 15అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు. 16అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు! 17“కాని నీ ప్రజలు, ‘అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా అలా వుండజాలడు!’ అని అంటారు. “కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! మారవలసిన మనుష్యులు వారే! 18ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు. 19ఒక దుర్మార్గుడు చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడై మంచి జీవితాన్ని ప్రారంభిస్తే అతడు జీనిస్తాడు! 20అయినా నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్పు పొందుతాడు!” 21అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకో బడింది!” అని అన్నాడు. 22ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువైన నా యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు. 23అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 24“నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజల మయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’ 25“ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా ‘రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం కొరకు మీరు మీ విగ్రహాలవైపు చూస్తున్నారు. మీరు ప్రజలను హత్య చేస్తారు. కావున ఈ దేశాన్ని మీకు నేనెందుకు ఇవ్వాలి? 26మీరు మీ కత్తిమీద ఆధార పడతారు. మీలో ప్రతి ఒక్కడూ భయంకరమైన పనులు చేస్తాడు. మీలో ప్రతి ఒక్కడూ మీ పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల మీరు ఈ రాజ్యాన్ని పొందలేరు!’ 27“‘ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తిని వేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు. 28దేశాన్ని నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసుకొని ఆ దేశం గర్వపడుతూ వుందో ఆ వస్తువులనన్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు శూన్యంగా తయారవుతాయి. ఆ ప్రదేశం గుండా ఎవ్వరూ పయనించరు. 29ఆ ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల ఆ దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ఈ ప్రజలు తెలుసుకుంటారు.” 30“‘నరపుత్రుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, వాకిళ్లలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపుతున్నాడో విందాం” అని చెప్పుకుంటారు. 31కావున వారు నా ప్రజలవలె నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరించరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. వారు ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని కోరుకుంటారు. 32“‘వారికి నీవు కేవలం ప్రేమ గీతాలు పాడే ఒక గాయకుడివి మాత్రమే. నీకు మధురమైన కంఠం ఉంది. నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు వింటారు గాని, వాటిని ఆచరించరు. 33అయినా నీవు పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు ప్రజలు తమలో నిజంగా ఒక ప్రవక్త నివసించాడని తెలుసుకుంటారు!’”


Copyrighted Material
Learn More

will be added

X\