ఆదికాండము 14

1షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాం రాజైన కదొర్లాయోమెరు, మరియు గోయియుల రాజైన తిదాలు. 2ఈ రాజులంతా కలసి సొదొమ రాజు బెరాతోను, గొమొర్రా రాజు బిర్షా, అద్మా రాజు షినాబు, సెబోయీయుల రాజు షెమేబెరు, బెల రాజు (సోయరు అని కూడ బెల పిలవబడింది) లతో యుద్ధము చేసారు. 3ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీమ లోయ యిప్పుడు ఉప్పు సముద్రం) 4ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేసారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేసారు. 5కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు. 6శేయీరు కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.) 7తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు) వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తమారులో ఈ ప్రజలు నివసిస్తారు. 8ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. 9ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేసారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ అయిదుగురితో యుద్ధం చేసారు. 10సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలివాళ్లు కొండల్లోకి పారిపోయారు. 11కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. 12అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు. 13పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడం బడిక చేసుకొన్నారు. అబ్రాహాముకు సహాయం చేసేందుకు గూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. 14లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అతంటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేసాడు. 15ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హూబ వరకు వారిని తరిమివేసారు. 16అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు. 17కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.) 18షాలెము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. సర్వోన్నతుడైన దేవునికి మెల్కీసెదెకు యాజకుడు. రొట్టెను ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు: “అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక, దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు. 20సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం నీ శత్రవుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేసాడు.” యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు. 22అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవా దేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేసానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలిన వారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”


Copyrighted Material
Learn More

will be added

X\