యిర్మీయా 47

1ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది. 2యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. 3పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు. 4ఫిలిష్తీయులనందరినీ యెహోవా త్వరలో నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. క్రేతు ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. 5గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు? 6“ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. నీ ఒరలోనికి నీవు వెళ్లుము! ఆగిపో! శాంతించు, అని మీరంటారు. 7కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”


Copyrighted Material
Learn More

will be added

X\