యెహోషువ 18

1ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు. 2అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి. 3కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. 4కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు. 5దేశాన్ని వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు. 6అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం. 7కానీ లేవీ ప్రజలకు మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. వారు యాజకులు, వారి పని యెహోవాను సేవించటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే తీసుకొన్నారు. వారు యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు.” 8కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు. 9కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు. 10ఆ సమయంలో యెహోషువ యెహోవాను సహాయం కొరకు వేడుకున్నాడు. ఒక్కో వంశానికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు. 11యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది: 12ఉత్తర సరిహద్దు యోర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది. 13తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్. 14బెత్‌హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు. 15దక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై నెఫ్తోయ నదివరకు విస్తరించింది. 16తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది. 17అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్‌షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు క్రిందికి విస్తరించింది. 18బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు అరబాలోనికి విస్తరించింది. 19తర్వాత ఆ సరిహద్దు బెత్‌హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యోర్దాను నది సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు. 20తూర్పు వైపున యోర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు. 21కనుక బెన్యామీను కుటుంబాలు ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్ కెజిబ్ 22బెత్ అరాబా, సెమరాయిము, బేతేలు 23అవ్విము, పారా, ఓఫ్రా 24కెఫెరు అమ్మోని, ఓఫ్ని, గెబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. 25బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబియోను, రామా, బెయెరొతు 26మిస్పే, కెఫిరా, మోసా, 27రెకెము, ఇర్పెయెలు, తరలా 28సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.


Copyrighted Material
Learn More

will be added

X\