మీకా 6

1యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను నీవు లేచి పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి. 2తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు! 3యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి! 4నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్ముల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను. 5నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి అకాసియ (షిత్తీయు) నుండి గిల్గాలువరుకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు యెహోవా న్యాయ వరున్తుడని మీరు తెలుసుకుంటారు!” 6దేవుడైన యెహోవా సన్నధికి నేను వచ్చినప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా? 7యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా, నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్నిబలి ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో భాగంగా పుట్టిన శిశువును అర్పించనా? 8మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు. యెహోవా నీ నుండి కోరేవి ఇవి: ఇతరుల పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు. ప్రజలపట్ల ప్రేమ, దయకలిగి ఉండటానికి ఇష్టపడు. అణకువ కలిగి నీ దేవునితో జీవించు. 9దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేము) పిలుస్తూవుంది. తెలివిగల మనష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవాని పట్ల ధ్యానముంచు! 10దుష్టులు తాము దొంగిలించిన ధనరాశులను ఇంకా దాస్తున్నారా? దుష్టులు ఇంకా మరీ చిన్నబట్టలతో జనాన్నిమోసగిస్తున్నారా? అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించు కుంటాడు! 11దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా? తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగతూకపురాళ్లు, దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా? అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి! 12ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు! 13కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను. నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను. 14నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు. నీ కడుపు ఖాళీగా ఉండి నీవు ఇంకా ఆకలితో ఉంటావు. నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు. కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు. 15నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగపడతావు; కానీ నీకు నూనెరాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు. 16ఎందకుంటే నీవు ఒమ్రీ నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ, అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు. నీవు వారి బోధలను పాటిస్తున్నావు. అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను. నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.


Copyrighted Material
Learn More

will be added

X\