సంఖ్యాకాండము 22

1తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి. 2ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజైన భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు. 4మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు. అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. 5బెయారు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు: “ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మే సేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. 6వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.” 7మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు. 8బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు అచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు. 9దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు. 10బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.” 12అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు. 13మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు. 14కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు. 15కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.” 18కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.” 20ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు. 21మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు. 22బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికు కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు. 23దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు. 24తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి 25మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు. 26తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 27యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు. 28అప్పుడు యోహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిదా, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో. 29“నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో. 30అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో. “అది నిజమే” బిలాము అన్నాడు. 31అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యోహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు. 32యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను. 33గాడిద నన్ను చూచి మూడు సార్లు నా నుండి పక్కకు తప్పుకొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడ్ని కాదు.” 34అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు. 35“లేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో చెప్పేమాటలే నీవు చెప్పాలి” అన్నాడు బిలాముతో యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యులతో బిలాము వెళ్లాడు. 36బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక అర్నోను సపిహద్దులో ఉన్న మోయాబు పట్టణం దగ్గర అతణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది అతని దేశపు పొలిమేర. 37బాలాకు బిలామును చూడగానే “నీవు రావాలని ఇది చాలా ముఖ్యమయిందని ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్లించ లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో. 38అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవాబిచ్చాడు. 39అప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్ హుచ్చోతుకు వెళ్లాడు. 40బాలాకు తన బలి అర్పణగా కొన్ని ఎడ్లను, గొర్రెలను వధించాడు. ఆ మాంసం కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయకులకు అతడు ఇచ్చాడు. 41ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.


Copyrighted Material
Learn More

will be added

X\