సంఖ్యాకాండము 32

1రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదేశాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పశువులకు బాగున్నట్టు వారికి కనబడింది. 2కనుక రూబేను, గాదు వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, యాజకుడైన ఎలీయాజరుతో, ప్రజా నాయకులతో వారు మాట్లాడారు. 3వారు ఇలా చెప్పారు: “మీ సేవ కులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.) 5మీకు ఇష్టమైతే ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతున్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని తీసుకొని వెళ్లొద్దు.” 6రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా? 7ఇశ్రాయేలు ప్రజలను మీరెందుకు అధైర్యపరుస్తున్నారు? నది దాటకుండా, యోహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా చేస్తారు మీరు. 8మీ తండ్రులు నాకు అలాగే చేసారు. కాదేషు బర్నేయ దగ్గర దేశాన్ని పరిశీలించి రావటానికి గూఢచారులను నేను పంపించాను. 9వారు ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపర్చారు. యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు. 10ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఇలా ప్రమాణం చేసాడు: 11‘ఈజిప్టు నుండి వచ్చిన వారిలో 20 సంవత్సరాలుగాని అంతకంటె ఎక్కువ వయసుగాని ఉన్నవారెవరూ ఈ దేశాన్ని చూడలేరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసాను. ఈ దేశాన్ని ఈ మనుష్యులకు ఇస్తానని నేను వాగ్దానం చేసాను. కానీ వీరు నన్ను వాస్తవంగా అనుసరించిలేదు. కనుక వీరికి ఈ దేశం దక్కదు. 12కెనెజీ వాడగు యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వాస్తవంగా యెహోవాను వెంబడించారు!’ 13“ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది. అందుచేతనే ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే యెహోవా వుండనిచ్చాడు. యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలందరూ చనిపోయేంతవరకు వారిని యెహోవా అక్కడనే ఉండనిచ్చాడు. 14ఇప్పుడు మీరు మీ తండ్రులు చేసిన పాపమే మళ్లీ చేస్తున్నారు. పాపాత్ములైన ప్రజలారా, యెహోవా ఆయన ప్రజల మీద మరింత ఎక్కువగా కోపగించాలని మీరు కోరుతున్నారా? 15మీరు యెహోవాను వెంబడించటం మానివేస్తే, ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువ కాలం అరణ్యంలో ఉండేటట్టు యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు ప్రజలందరినీ నాశనం చేస్తారు!” 16కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా చెప్పారు: “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు కట్టుకుంటాము. 17ఇశ్రాయేలీయులను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత ప్రాకారంగల పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి. 18ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము. 19యొర్దాను నదికి పశ్చిమ దిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి పూర్వ దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.” 20కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవుతుంది. కానీ మీ సైనికులు మాత్రం యెహోవాకు ముందు యుద్ధానికి వెళ్లాలి. 21మీ సైనికులు యొర్దాను నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టుచేయాలి. 22ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు యెహోవా మనందరికీ సహాయం చేసిన తర్వాత, మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకోనిస్తాడు. 23కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి. 24మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే. మీరు మీ ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.” 25అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము. 26మాభార్యలు, పిల్లలు, మాపశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. 27కానీ, నీ సేవకులమైన మేము మాత్రం యొర్దాను నది దాటతాము అయితే మా యజమాని చెప్పినట్టు మేము యెహోవా ముందర యుద్ధానికి ముందడుగువేస్తాం.” 28కనుక ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రమాణాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యోహోషువ, ఇశ్రాయేలు వంశాల నాయకులు అందరూ విన్నారు. 29మోషే వారితో చెప్పాడు: “గాదు, రూబేను ప్రజలు యొర్దాను నది దాటుతారు. వారు యెహోవాముందు యుద్ధానికి నడుస్తారు. మీరు దేశాన్ని వశం చేసుకునేందుకు వారు సహాయం చేస్తారు. దేశంలో వారి భాగంగా గిలాదు ప్రాంతాన్ని మీరు వారికి ఇవ్వవలెను. 30కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మీకు సహాయం చేస్తామని వారు ప్రమాణం చేస్తున్నారు.” 31గాదు, రూబేను ప్రజలు జవాబిచ్చారు: “యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మేము చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. 32మేము యొర్దాను నది దాటి, యెహోవా ముందు కనాను దేశంలోకి నడుస్తాము. అయితే ఈ దేశంలో మా భాగం మాత్రం యొర్దాను నది తూర్పు ప్రదేశం.” 33కనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే వంశంలో సగంమంది ప్రజలకు ఆ ప్రదేశాన్ని మోషే ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీవాడగు సీహోను రాజ్యం, బాషాను రాజైన ఓగు రాజ్యం ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి. 34గాదు ప్రజలు దీబోను, అతారోతు, అరోయేరు, 35అత్రోతు షోపను, యాజెరు, యోగ్‌బహ, 36బేత్‌ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు. 37రూబేను ప్రజలు హెష్బోను, ఏలాలే, కిర్యాతాయిము 38నెబో, బయల్మెయోను, షిబ్మా పట్టణాలను నిర్మించారు. వారు మరల కట్టిన పట్టణాలకు పాత పేర్లనే ఉపయోగించారు. అయితే నెబో, బయల్మెయోను పేర్లను వారు మార్చివేసారు. 39మాకీరు వంశం నుండి ప్రజలు గిలాదుకు వెళ్లారు. (మాకీరు మనష్షే కుమారుడు.) వారు ఆ పట్టణాన్ని ఓడించారు. అక్కడ నివసించిన అమోరీయులను వారు ఓడించారు. 40కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. 41మనష్షే వాడైన యాయీరు అక్కడి చిన్న పట్టణాలను ఓడించాడు. అప్పుడు వాటిని యాయీరు పల్లెలు అని అతడు పిల్చాడు. 42నాతును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు తన స్వంత పేరు పెట్టాడు.


Copyrighted Material
Learn More

will be added

X\