సామెతలు 25

1ఇవి సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవకులు నకలు చేసిన మాటలు ఇవి: 2మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయాలను దాచి పెట్టేందుకు ఆయనకు అధికారం ఉంది. కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలంగానే ఘనపర్చబడతాడు 3ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన కింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం. 4వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు. 5అదే విధంగా ఒక రాజు సమక్షం నుండి దుర్మార్గవు సలహాదారులను నీవు తొలగించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని బలమైనదిగా చేస్తుంది. 6ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు. 7రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును. 8నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 9నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు. 10నీవలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు. 11సమయానికి తగిన రీతిగా పలుక బడిన మంచిమాటలు వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండులా ఉంటుంది. 12జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు నగలకంటే అది ఎక్కువ విలువగలది. 13నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు. 14కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, గాలిలాంటివారు. 15సహసంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి ఒక అధికారి ఆలోచననేగాని మార్పుతుంది. నిదానంగా మాట్లాడటం చాలా శక్తివంతమైనది. 16తేనె మంచిది. కానీ దానిని మరీ ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. 17అదే విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్లవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు కోవటం మొదలు పెడతాడు. 18సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైనవాడు.అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు. 19కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు. 20ధు:ఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడటం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం చేసినట్టు ఉంటుంది. 21నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్లు యివ్వు. 22నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. 23ఉత్తరం నుండి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదే విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి. 24వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బతకటం మేలు. 25దూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్టు ఉంటుంది. 26ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది. 27నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు. 28ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల పట్టణంలా ఉంటాడు.


Copyrighted Material
Learn More

will be added

X\