కీర్తనలు 146

1యెహోవాను స్తుతించండి! నా ప్రాణమా! యెహోవాను స్తుతించు! 2నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను. 3సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు. 4మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడుతారు. అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే. 5సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు. 6భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు. యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు. 7అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు. చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు. 8గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు. 9మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు. అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు. 10యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. యెహోవాను స్తుతించండి!


Copyrighted Material
Learn More

will be added

X\