కీర్తనలు 21

1యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది. నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు. 2రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు. మరియు యెహోవా, రాజు అడిగిన వాటిని నీవు అతనికిచ్చావు. 3యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచి వాటిని రాజుకిచ్చావు. బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు. 4దేవా, జీనంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు. నీవు రాజుకు నిరంతరం సాగే దీర్గాయువు నిచ్చావు. 5రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి ఉంది. నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు. 6దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు. నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెస్తుంది. 7రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు. 8రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు. నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది. 9నీవు కనబడినప్పుడు ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు. యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది. మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు. 10ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు. 11ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు. చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు. 12కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు. 13యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.


Copyrighted Material
Learn More

will be added

X\