కీర్తనలు 27

1యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను. 2దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు. వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు. వారు నా శత్రువులు, విరోధులు. వారు కాలు తప్పి పడిపోదురు. 3ఆయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను. యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను. 4యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.” 5నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు. 6నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కానీ ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను. 7యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము. నా మీద దయ చుపించుము. 8యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది. వెళ్లు నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను. 9యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము. కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు. నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు. 10నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు. 11యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము. సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము. 12నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు. నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు. 13నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని నిజంగా నేను నమ్ముచున్నాను. 14యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము. బలంగా, ధైర్యంగా ఉండుము. యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.


Copyrighted Material
Learn More

will be added

X\