కీర్తనలు 4

1నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము. నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము! ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము. 2ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు? ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం. 3యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు. నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు. 4మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు. కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి. 5దేవునికి మంచి బలులు అర్పించండి. మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి. 6“దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు? యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు. 7యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు చేత పంట కోత సమయంలో సంబరపడే దాని కంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము. 8నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.


Copyrighted Material
Learn More

will be added

X\