కీర్తనలు 5

1యెహోవా, నా మాటలు ఆలకించుము. నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్న దాన్ని వినుము. 2నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము. 3యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను. సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను. మరి నీవు నా ప్రార్థనలు వింటావు. 4యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర వుండడానికి ఇష్టపడవు చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు. 5గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు. ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు. 6అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు. ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు. 7యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు. యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను. 8యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు. కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము. నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో అది నాకు తేటగా చూపించుము. 9ఆ మనుష్యులు సత్యం చెప్పరు. వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు. వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి. ఆ మనుష్యులు ఇతరులకు చక్కనిమాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు. 10దేవా! వారిని శిక్షించుము. వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము. ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము. 11అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము. ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము. 12యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.


Copyrighted Material
Learn More

will be added

X\