కీర్తనలు 84

1సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది. 2యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను. నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది. 3సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా, పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి. అక్కడే వాటి పిల్లలు ఉంటాయి. 4నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు. 5ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు. వారు నిన్నే నడిపించ నిస్తారు. 6దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నీటి మడుగులు నిలిచే బాకా లోయగుండా వారు పయనిస్తారు. 7వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయేమార్గంలో ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు. 8సర్వశక్తిమంతుడవై యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే యాకోబు దేవా, నా మాట వినుము. 9దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము. 10దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె నీ ఆలయంలో ఓక్కరోజు ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు. 11యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు. 12సర్వశక్తిమంతుడవై యెహోవా, నిన్ను నమ్ముకోనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.


Copyrighted Material
Learn More

will be added

X\