కీర్తనలు 92

1యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది. 2ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం, రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది. 3దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది. సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది. 4యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు. నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం. 5యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం. 6నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము. 7దుర్మార్గులు గడ్డిలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు. 8కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించ బడతావు. 9యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడుతారు. 10కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు. 11నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను. 12నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు. 13మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాట బడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు. 14వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు. 15యెహోవా మంచివాడని నేను చెబతున్నాను. ఆయనే నా బండ. ఆయనలో అవినీతి లేదు.


Copyrighted Material
Learn More

will be added

X\